టీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త అందించింది. ఇక నుంచి రిజర్వేషన్ చేసుకున్న బస్సు ఎక్కడుంది? ఎప్పటికి వస్తుంది? గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటుంది? వంటి వివరాలను ట్రాక్ చేసేందుకు యాప్ రూపొందించింది. ప్రయాణీకులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేందుకు TSRTC Bus Tracking యాప్ లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది. ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణీకుల ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు ట్రాకింగ్ లింకును కూడా పంపిస్తారు. లింకును క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ సర్వీసును సంక్రాంతికి ముందస్తు రిజర్వేషన్ చేసుకునే 1800 బస్సులకు అనుసంధానం చేసినట్టు ఆర్టీసీ వెల్లడించింది. త్వరలోనే హైదరాబాదులోని మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులు సహా మిగిలిన బస్సులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచే కాక, ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ యాప్ లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రేక్ డౌన్, రోడ్డు ప్రమాదం, వైద్య సహాయం తదితర వివరాలను కూడా ఈ యాప్ లో ప్రయాణీకులు రిపోర్టు చేయవచ్చు. దాని ఆధారంగా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.