Businessman dies of heart attack while speaking at Independence Day celebrations in Hyderabad
mictv telugu

ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

August 15, 2022

హైదరాబాద్ నగరంలోని కాప్రాలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. జెండా వందనం కార్యక్రమం తర్వాత జరిగిన సభలో ప్రసంగిస్తూ.. ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. కాప్రా పరిధిలోని వంపుగూడ ‘లక్ష్మి విల్లాస్’లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని విల్లాస్‌లో సోమవారం ఉదయం.. కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండా వందనం అనంతరం వ్యాపారి ఉప్పల సురేష్ (56) ప్రసంగించారు. స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన ఘట్టాల గురించి ప్రస్తావిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. అక్కడే ఉన్న సురేష్ తండ్రి యాదగిరి, భార్య కరుణ, కూతురు మైత్రి, కుమారుడు ధర్మపాల్.. ఆయన హఠాన్మరణానికి షాకయ్యారు.

వెంటనే స్థానికులు సురేష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండె పోటు కారణంగా సురేష్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో కాప్రాలోని వంపుగూడలో విషాద వాతావరణం నెలకొంది. ఉప్పల సురేష్.. బాగ్ అంబర్ పేట పరిధిలోని డి.డి. కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఆయన మరణవార్త విని పలువురు విస్మయం చెందారు. తన కళ్ల ముందే కొడుకు మృతి చెందటం బాధాకరం అంటూ తండ్రి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.