ఏపీ శాప్ చైర్మెన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదాన్ని సృష్టించారు. ఇప్పటివరకు విభజన సమస్యలు ప్రధానంగా ఉండగా, ఇప్పుడు రాజకీయపరంగా కొత్త వివాదం మొదలైంది. బుధవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నలుగురు ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సభలో కేసీఆర్ దేశ రాజకీయాలపై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు.
అంతకుముందు కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ని నియమించి ఆంధ్రా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. తెలంగాణ మంత్రులు కూడా బీఆర్ఎస్ ఏపీలో ప్రభావం చూపిస్తుందని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఏపీలో ఏం చేస్తుందో చూద్దాం అంటూనే వైఎస్ జగన్ తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తే అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు వస్తాయని తీవ్రంగా స్పందించారు.
జగన్ సార్ తెలంగాణలో వేలు పెడితే అక్కడి ప్రభుత్వాలు తలకిందులవుతాయని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ కి తెలంగాణలోని ప్రతీ గ్రామంలో అభిమానులు ఉన్నారని, ఆయన కోసం స్పందించే కోట్ల హృదయాలు వేచి చూస్తున్నాయని తేల్చి చెప్పారు. ఈ రకంగా చూస్తే అధికారంలో ఉన్నా లేకున్నా వైఎస్ జగన్‌కి ప్రైవేట్ సైన్యమే ఉందని అభిప్రాయపడ్డారు. ‘బీఆర్ఎస్ వస్తుంది. పొడిచేస్తుంది చింపేస్తుంది అంటున్నారు.
తెలంగాణ మంత్రులు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు. వాళ్లు ఇక్కడకి వచ్చి ఏం చించుతారో, పొడుస్తారో తెలియదు కానీ జగన్ వేలు పెడితే మాత్రం అక్కడి ప్రభుత్వం తలకిందులవుతాయి’ అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటికే వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోని వైసీపీ తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తుందా? అన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది.