దేశం వదిలేసి వెళ్లిపో.. సీఏఏ వ్యతిరేక యువతికి నోటీస్ - MicTv.in - Telugu News
mictv telugu

దేశం వదిలేసి వెళ్లిపో.. సీఏఏ వ్యతిరేక యువతికి నోటీస్

February 29, 2020

kjfn

సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో మన దేశంలోని ముస్లింలు, మేధావులే కాకుండా చదువుసంధ్యల కోసం మనదేశానికి వచ్చినవారు కూడా పాల్గొంటున్నారు. అయితే ఇది వీసా నిబంధనలకు వ్యతిరేకం కావడంతో కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకుంటోంది. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక విశ్వభారతి విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న అఫ్సరా అనే బంగ్లాదేశ్‌ యువతి సీఏఏ నిరసనల్లో పాల్గొనడం కేంద్రం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ‘మీరు భారత ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. చదువు కోసం వచ్చి, వీసా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. నోటీసులు అందిన 15రోజుల్లోగా మా దేశం నుంచి వెళ్లిపోండి’ అని నోటీసుల్లో పేర్కొంది.
అఫ్సరా 2018లో వర్సీటీ చేరింది. ఆమె సీఏఏ నిరసనల్లో చురుగ్గా పాల్గొంటోంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. ధర్నాల్లో తాను పాల్గొంటున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారత దేశంలో స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. విషయం కేంద్రానికి కూడా తెలియడంతో నోటీసులు పంపింది. సీఏఏను వ్యతిరేకించిన ఓ జర్మనీ విద్యార్థి(మద్రాస్ ఐఐటీ) కి కూడా కేంద్రం దేశం నుంచి వెళ్లిపోవాలని తాఖీదు జారీ చేసింది.