సరొగసీకి వితంతువులు కూడా అర్హులే - MicTv.in - Telugu News
mictv telugu

సరొగసీకి వితంతువులు కూడా అర్హులే

February 27, 2020

nvn

మనదేశంలో క్రమంగా సరొగసీకి ఆదరణ పెరుగుతోంది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు సరోగసీ ద్వారా సంతానం పొందుతున్నారు. దీంతో సరోగసీ చట్టాలను సవరిస్తూ గత ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. అయితే దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్‌ యాదవ్‌ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. 

రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని గర్భం నియంత్రణ బిల్లు–2020 కి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వితంతువులు, విడాకులు పొందిన వారు కూడా ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లులో తెలిపింది. సరోగసీపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ ఇచ్చిన సూచనలు అన్నింటినీ తాజా బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. సరోగసీని వాణిజ్యానికి వాడకుండా నిరోధించడం, మంచి ఉద్దేశమైతే సరొగసీకి సహకరించడం ఈ కొత్త బిల్లు లక్ష్యాలని మంత్రి చెప్పారు. దేశంలో భారత్‌కు చెందిన దంపతులు మాత్రమే సరోగసి చేపట్టేందుకు వీలుంటుందని మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టే వీలుంది.