Cabinet approves Tejas 2.0 project
mictv telugu

రూ. 6500 కోట్లతో తేజాస్ 2.0.. ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం

September 1, 2022

ఆయుధ తయారీ రంగంలో అధికభాగం దిగుమతులపైనే ఆధారపడిన భారత దేశం.. త్వరత్వరగా స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఏళ్ల తరబడి చేసిన కృషి ఫలితంగా తేజాస్ అనే యుద్ధ విమానాన్ని విజయవంతంగా కనుగొనగలిగింది. తన శ్రేణిలోని విదేశీ యుద్ధ విమానాలకు ధీటుగా నిలుస్తుండడంతో తేజాస్‌పై కొన్ని దేశాలు తన ఆసక్తిని చూపాయి. ఇందులో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉండడం గమనార్హం. ఇప్పుడు తేజాస్ 2.0 పై భారత్ దృష్టి సారించింది. తేజాస్‌ను మరింత అభివృద్ధి పరిచే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ కమిటీ (భద్రతాపరమైన అంశాలు) ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టు వ్యయం రూ. 6,500 కోట్లు కాగా, ఇప్పటికే రూ. 2,500 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న తేజాస్‌లో జీఈ 404 ఇంజిన్లను వినియోగించగా, తేజాస్ 2 లో మరింత శక్తివంతమైన జీఈ 414 ఇంజిన్లను అమరుస్తారు. ఇవి 98 కిలో న్యూటన్ల శక్తి విభాగానికి చెందినవి. దీంతో పోరాట పరిధి పెరగడమే కాక, అత్యధిక భారీ అస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం సమకూరుతుంది. దీంతో పాటు స్టెల్త్ప్ పరిజ్ఞానంతో కూడిన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 15,000 కోట్లు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.