భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వీటి పరిస్థితే ఇలా ఉంటే ఇక గోదావరి సంగతి చెప్పనవసరం లేదు. దాని ఉధృతిని చూసి తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. తెలంగాణలో గోదావరికి వచ్చిన వరదల ధాటికి బుధవారం ఉదయం మత్స్యకారుల ‘కేజీ కల్చర్’ యూనిట్లు కొట్టుకుపోయాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరద తీవ్రంగా రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 55 గేట్లు ఒకేసారి ఎత్తి నీటిని దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఈ నీటి ధాటికి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మత్స్యకారులు ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసుకున్న ఎనిమిది కేజ్ కల్చర్ యూనిట్లు కొట్టుకుపోయాయి. ఇందులో సుమారు కోటి విలువైన వంద టన్నుల చేపలు జలాశయం గేట్ల నుంచి వెళ్లిపోయాయి. ఇవేగాక, 80 పొందుతారు, నాలుగు మోటారు బోట్లు, ఆరు టన్నుల చేపల దాణా, నీటిపై తేలియాడే షెడ్లు, వలలు, లైవ్ జాకెట్లు వంటివి పూర్తిగా ప్రవాహంలో కలిసిపోయాయి. దీంతో రూ. 4 కోట్ల నష్టం వాటిల్లినట్టు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.