కొట్టేసిన బ్యాగ్ తెరిచి.. జడుసుకున్న దొంగలు - MicTv.in - Telugu News
mictv telugu

కొట్టేసిన బ్యాగ్ తెరిచి.. జడుసుకున్న దొంగలు

October 9, 2019

పోతూ పోతూ మీకొక బ్యాగ్ దొరికిందనుకోండి. అప్పుడేం చేస్తారూ.. వెంటనే విప్పి అందులో ఎంత సొమ్ము వుందో అదంతా తీసుకోవాలని ఆరాటం కొద్దీ విప్పి చూస్తారు. అప్పుడు అందులో సొమ్ము కాకుండా పాములు బుసకొట్టాయి అనుకోండి ఏం చేస్తారూ? అసలు బ్యాగులో పాములు వుంటాయన్న ఊహే రాదు. అలాంటిది పాములు ఎలా వుంటాయని అడగొచ్చు. ఒకవేళ వుంటే చచ్చి బతికినంత పనే అవుతుంది కదూ. అదే జరిగింది ఈ దొంగల విషయంలో. కారు దగ్గర వున్న బ్యాగు కనిపించగానే దానిని అందుకుని లగెత్తారు. బ్యాగు ఓనరు ఒరేయ్ నాయనా ఆగండ్రా అన్నా వినిపించుకోకుండా పరుగెత్తుకెళ్ళారు. తీరా వెళ్లాక విప్పి చూశాక వారి పరిస్థితి ఎలా వుంటుందోనని బ్యాగు ఓనరు లబోదిబోమంటున్నాడు. వెంటనే అతను ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త బయటకు వచ్చింది. 

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్‌జోస్‌లో శనివారం చోటు చేసుకుంది ఈ ఘటన. కాంబెల్‌లో బ్రియాన్ గుండి అనే వ్యక్తి సర్పాల మంచి కోసం స్థానికంగా స్నేక్ ఎడ్యుకేషనల్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ లైబ్రరీలో ఐదు సరీసృపాలను తీసుకెళ్లి ఒక ప్రదర్శన నిర్వహించాడు. ప్రదర్శన అయిపోయాక ఒక బ్యాగులో ఆ ఐదు సరీసృపాలను పెట్టి  పార్కింగ్‌లో ఉన్న తన కారు వద్దకు వెళ్లాడు. కారుకు 150 అడుగుల దూరంలో బ్యాగును ఉంచి బ్రియాన్ వెళ్లాడు. అతని వద్ద బ్యాగు కొట్టేద్దామని దొంగలు ఎప్పటినుంచి కాపుగాస్తున్నారో ఆ పరిసరాల్లో. బ్రియాన్ అలా వెళ్లగానే భలే ఛాన్సు అనుకుని వెళ్లి బ్యాగు తీసుకుని పరారయ్యారు. 

దీంతో బ్రియాన్ షాక్ అయ్యాడు. వెంటనే వారిని వెంబడించాడు. ఆ బ్యాగును విప్పితే వారికి ప్రయోజనం వుండదు.. అందులో పాములు వున్నాయన్న విషయం వాళ్లకు ఎలా చెప్పాలా అని అతను పరుగెత్తాడు. కానీ, దొంగల అతనికి చిక్కకుండా మరింత పరుగు లంఖించారు. ఆ బ్యాగులో ఎంత డబ్బు లేకపోతే అతను అంతలా పరుగెత్తుతాడని వేగంగా పరుగులు తీశారు. 

ఈ ఘటనపై ఆదివారం ఆయన ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు ఎత్తుకెళ్లిన బ్యాగులో డబ్బులు లేవని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందులో  ప్రత్యేకమైన జాతికి చెందిన ఒక బల్లితో పాటు నాలుగు సర్పాలు వున్నాయి. వాటి విలువ సుమారు రూ. 3లక్షల 56 వేలు వుంటుందని తెలిపాడు. అయితే ఆ పాములు విషపూరితమైనవి కావని, వాటికి ఎలాంటి హాని తలపెట్టవదని ఆయన కోరాడు. సరీసృపాలతో ఉన్న ఆ సంచిని దొంగలించిన వ్యక్తులు దానిని తెరిచి చూశాక వారి పరిస్థితి ఎలా వుంటుందో ఊహించగలననని.. కానీ, అవి మీకు ఎలాంటి హాని కలిగించవు. కనుక వాటిని జాగ్రత్తగా తన చిరునామాకు తెచ్చి ఇవ్వగలరని ఆయన విజ్ఞప్తి చేశాడు.