దాదాపు 40 మంది కాల్ గర్ల్స్‌తో రాజకీయ నాయకులు, అధికారులకు వలపు వల వేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భారీ స్కాండల్‌లో మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు బాధితులుగా వున్నారు. వారికి వలపు వల వేసి, బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి వారిని పట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ స్కాంలో ఐదుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి నుంచి 92 హై క్వాలిటీ వీడియోలను, రెండు ల్యాప్‌టాప్‌లను, పలు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సెక్స్ రాకెట్ శ్వేత స్వప్నిల్ జైన్ అనే మహిళ నేతృత్వంలో నడుస్తోందని పోలీసులు తేల్చారు. ఆమెను విచారించగా మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తన సెక్స్ రాకెట్‌ను నడపడానికి బాలీవుడ్‌కు చెందిన బీ గ్రేడ్ నటీమణులతో పాటు, 40 మంది టాప్ క్లాస్ కాల్ గర్ల్స్ను ఒక ముఠాగా ఏర్పాటు చేసుకుంది. వారితో రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు వల వేసి, వారికి దగ్గరయ్యేలా చేసేది. వారి పన్నాగంలో భాగంగా తాను చెప్పిన గెస్ట్ హౌజ్‌కు, ఫైవ్ స్టార్ హోటల్‌కు రావాలని వారికి చెప్పేది. టెమ్ట్ అయిన విటులు వారు రమ్మన్న దగ్గరికి వెళ్లేవారు. సదరు వ్యభిచారిణితో సెక్స్ చేస్తుండగానే ఆ తతంగాన్నంతా ముందుగానే సెట్ చేసుకున్న ఫోన్లలో, కెమెరాల్లో రికార్డు చేసేవారు.
అనంతరం ఆ వీడియోలతో వారిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించేది. అలా మొత్తం 92 హై క్వాలిటీ వీడియోలను హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచిందామె. వాటితో రాజకీయ నాయకులను, అధికారులను బ్లాక్మెయిల్ చేయించేది. తాను డిమాండ్ చేసినంత ఇవ్వమని చెప్పేది. ఈ క్రమంలో ఆమె ఒక్కొక్కరి నుంచి లెక్కకుమించి దోచుకుంది. ఓ మాజీ సీఎం నుంచి విలాసవంతమైన బంగ్లాను కూడా దక్కించుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టులను కూడా చేజిక్కించుకుంది. ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే భార్య చేస్తున్న బద్మాశ్ పనులకు భర్త స్వప్నిల్ జైన్ కూడా సాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. వీరి వలలో పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చిక్కుకున్నట్లు సమాచారం.
భోపాల్ వేదికగా కొన్నేళ్లుగా ఈ కుంభకోణం కొనసాగుతోందని, ఇందులో చిక్కుకున్న వారిలో 80 శాతం బీజేపీ నేతలు ఉన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా ఆరోపించారు. శ్వేతతో పాటు ఆర్తి దయాల్ అనే మహిళ కూడా ఇలాగే అధికారులకు, రాజకీయ నాయకులకు వలపు వల వేసినట్లు పోలీసులు తేల్చి ఆమెనూ అదుపులోకి తీసుకున్నారు. వాళ్లవద్దనున్న సీడీలు, హార్డ్ డిస్క్‌ను పోలీసులు సిట్‌కు అప్పగించారు. కాగా, ఈ కేసులో తమ పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని పలువురు రాజకీయ నాయకులు, అధికారుల బిక్కుబిక్కుమంటున్నారు.