పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేసుకుంటున్న వివాహితుల మీద కూడా మృగాళ్ల కున్ను పడుతోంది. ఫోన్ నంబర్లు కనుక్కుని వేధిస్తున్న ఘటనలు చూస్తున్నాం. దీంతో కొంతమంది మహిళల కాపురాలు కొల్లేరులు అవుతున్నాయి. తాజాగా తన భార్యకు చీటికి మాటికీ ఫోన్లు చేస్తున్న ఓ వ్యక్తిని ఆమె భర్త కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన విజయవాడలోని పటమట స్టెల్లా కాలేజీ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక వివాహిత మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్లు చేస్తున్నాడు. ఫోన్ చేసినప్పుడల్లా అసభ్యంగా మాట్లాడుతూ వేధించసాగాడు. దీంతో విసుగెత్తిన సదరు మహిళ తన భర్త సిద్దుల రవిపాల్కు అసలు విషయం చెప్పింది.
రవిపాల్ కోపంతో రగిలిపోయాడు. తన భార్యను వేధిస్తున్న అతనికి సరైన బుద్ధి చెప్పాలనుకున్నాడు. పథకం ప్రకారం తన భార్యతోనే పిచ్చయ్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన పిచ్చయ్యపై రవిపాల్ కత్తితో దాడిచేశాడు. పలుమార్లు కత్తితో పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పిచ్చయ్యను వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.