21 కాదు.. 49 రోజులు ఉండాల్సిందే.. కేంబ్రిడ్జి పరిశోధకులు - MicTv.in - Telugu News
mictv telugu

21 కాదు.. 49 రోజులు ఉండాల్సిందే.. కేంబ్రిడ్జి పరిశోధకులు

March 31, 2020

Cambridge Researcher Comments On India Lockdown 

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్ అస్త్రాలను వివిధ దేశాలు ప్రయోగిస్తున్నాయి. భారత్ కూడా కరోనా కట్టడికి 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంబ్రిడ్జి పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు.  5 రోజుల సడలింపులతో నాలుగు దశల్లో మూడు లాక్ డౌన్లు అవసరమని అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల క్వారంటైన్ సమర్ధవంతంగా  అమలు చేయగలిగి, కేసుల సంఖ్య తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియరీటికల్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకుడు రాజేష్ సింగ్ బృందం ఈ అంశాలను వెల్లడించింది. మూడు వారాల లాక్‌డౌన్ సరిపోదనే తాము  ప్రధానంగా నమ్ముతున్నామని,  పేర్కొంది. మార్చి 25న లాక్‌డౌన్ విధింపు, ప్రతి ఒక్కరినీ ఇళ్లకు పరిమితం చేయడం లాంటి పరిణామాల అనంతరం జరిగిన గణిత గణనల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు చెబుతున్నారు. నాలుగు దశల్లో వేర్వేరు నియంత్రణ ప్రోటోకాల్స్‌ను తీసుకొని మూడు సార్లు విధించాలన్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న మొదటి దశతో వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వైరస్ తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నట్టు గుర్తించామన్నారు. అందుకే మూడు దశల్లో 49 రోజులపాటు దీన్ని అమలు చేయాలని సూచించారు.