ఫామ్‌లోకి వచ్చాడు.. బెంగళూరును గెలిపించాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఫామ్‌లోకి వచ్చాడు.. బెంగళూరును గెలిపించాడు

May 20, 2022

ఐపీఐల్ 2022 మ్యాచ్‌లు ‘నువ్వా – నేనా’ అన్న రేంజ్‌లో జరుగుతోన్నాయి. ‘ప్లేఆఫ్స్’కి చేరుకోవటం కోసం చావోరేవో అన్నట్లుగా బౌలర్లు, బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ క్రమంలో గతకొన్ని రోజులుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ‘కోహ్లీ ఫామ్ కోల్పోయాడు, కొన్ని రోజులు పక్కన పెట్టండి’ అని నెటిజన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్‌ను ఖండిస్తూ, ‘నేను ఫామ్‌లో ఉన్నాను. మళ్లీ పాత కోహ్లీని చూయిస్తానంటూ’ గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి, బెంగళూరును గెలిపించి, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అందులో హార్దిక్ పాండ్యా 47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో (62), డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 3 సిక్సర్లతో (34), వృద్ధిమాన్ సాహా (31), మాథ్యూవేడ్ (16) పరుగులు చేశారు. ఇక చివరగా రషీద్ ఖాన్ 6 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో (19) పరుగులు చేశారు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు…విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో (73) పరుగులు చేశాడు. కెప్టెన్ డుప్లెసిస్ 38 బంతుల్లో 5 ఫోర్లతో (44), మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో (40) పరుగులు చేయగా, ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి గుజరాత్‌పై ఘన విజయాన్ని సాధించింది. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో బెంగళూరు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి తిరిగి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.