పాకిస్తాన్ గలీజ్ పాలిటిక్స్.. మాజీ ప్రధాని కూతురి బాత్రూంలో కెమెరా! - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్ గలీజ్ పాలిటిక్స్.. మాజీ ప్రధాని కూతురి బాత్రూంలో కెమెరా!

November 13, 2020

pakisatnu01

పాకిస్తాన్ రాజకీయాలు కుళ్లి కంపుకొడుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపణలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా రకరకాల దారుల్లో చెక్ పెడుతోంది. ఆర్థిక మాంద్యం, కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అంతేకాకుండా ప్రతిపక్షాలపైనా వేధింపులకు పాల్పడుతోంది.  

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేసింది. తను జైల్లో ఉన్నప్పుడు తన గదిలో, బాత్రూంలో ప్రభుత్వం రహస్య కెమెరాలు పెట్టిందని ఆమె వెల్లడించింది. అక్బర్ చౌదరీ షుగర్ మిల్స్ మనీల్యాండరింగ్‌ కేసులో ఆమె గత ఏడాది జైలుకు వెళ్లింది. జైల్లో తన జీవితం గురించి తాజాగా మీడియాకు చెప్పింది. 

‘నేను రెండుసార్లు జైలుకు వెళ్లాను. అక్కడ ఎలా బతికానో చెప్పడానికి మాటలు లేవు. అవన్నీ చెబితే జైలు అధికారులు సిగ్గుతో తలదించుకుంటారు. నా తండ్రి ముందే నన్ను అరెస్ట్ చేశారు. బూతులు తిట్టారు. అయినా నేను భయపడను. ఇమ్రాన్ ప్రభుత్వం మహిళలను ఇలా వేధిస్తున్నందకు సిగ్గు పడాలి. అసలు పాకిస్తాన్‌లో మహిళలకు రక్షణ ఉందా?’ అని ఆమె ప్రశ్నించింది. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆర్మీకి సాయం చేస్తామని కూడా ఆమె చెప్పింది. రాజ్యాంగ పరిధిలో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఆర్మీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని మరియం చెప్పింది. 

పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలైన మరియం రాజకీయాల్లో నిలదొక్కుకోడానికి అష్టకష్టాలు పడుతోంది. అవినీతి కేసులో జైలుశిక్ష ఎదుర్కొంటున్న తండ్రి నవాజ్ షరీఫ్ లండన్‌లో ఉండడంతో ఆమె పాక్‌లో పార్టీని బలోపేతం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది. తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాక్ ప్రభుత్వం సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చివరికి ప్రధాని నివాసంలోని గేదెలను కూడా అమ్మేసిన సంగతి తెలిసిందే.