మెల్బోర్న్ వేదికగా సాగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కామెరూన్ గ్రీన్ అర్థ సెంచరీ సాధించాడు. 177 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. ఓ పక్క వార్నర్ డబుల్ సెంచరీ, అలెక్స్ క్యారీ సెంచరీ కొట్టినా..గ్రీన్ అర్థ సెంచరీ ప్రత్యేకంగా నిలిచింది. దీనికి కారణం అతడో ఒక గాయంతో బాధపడుతున్నా..జట్టు కోసం క్రీజ్‌లో నిలబడడమే. రెండవ రోజు బ్యాటింగ్ చేస్తుండగా గ్రీన్ చేతికి తీవ్ర గాయమైంది. దక్షిణాఫ్రికా పేసర్ నోర్జే విసిరిన బంతి గ్రీన్ చేతి వేలిని బలంగా తాకింది. ఈ సమయంలో రక్తం ధారలా కారింది. దీంతో వెంటనే అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌తో పాటు తరువాత మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. అయితే చికిత్స అనంతరం అతడు గాయంతోనే మైదానంలో బరిలోకి దిగాడు.
సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని చివరి వరకు నిలబడ్డాడు. అలెక్స్ క్యారీతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరికి ఆసీస్ 575/8 స్కోరు వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు ఆలౌట్ అయన సఫారీ జట్టు ఇంకా 371 పరుగలు వెనుక బడి ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో అర్థసెంచరీతో చెలరేగిన గ్రీన్..అంతకుముందు బౌలింగ్ లో కూడా రాణించాడు. ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ మినీ వేలంలో గ్రీన్ భారీ ధరకు అమ్ముడయ్యాడు. రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ గ్రీన్‌ను సొంతం చేసుకుంది.