వింత జీబ్రా.. చారలకు బదులు చుక్కలు - MicTv.in - Telugu News
mictv telugu

వింత జీబ్రా.. చారలకు బదులు చుక్కలు

September 19, 2019

కంచర గాడిద ఎలా వుంటుంది అని ఎల్‌కేజీ విద్యార్థిని అడిగినా నలుపు, తెలుపు రంగుల గీతలతో వుంటుందని చెప్తారు. ఇది చాలా సింపుల్ ప్రశ్న. మరి దీనిని చూస్తే ఏమంటారో మీరే తేల్చుకోవాలి. నలుపు తెలుపు గీతలతో కాకుండా తెలుపు చుక్కలతో వున్న ఈ అరుదైన జీబ్రా కెమెరా కంటికి చిక్కింది. కెన్యాలోని మాసయ్ మరా నేషనల్ రిజర్వులో డార్క్ కోటెడ్ తెల్ల మచ్చలతో ఉన్న జీబ్రా తల్లితో తిరుగుతుండగా.. ప్రముఖ టూరిస్ట్ గైడ్, ఫొటోగ్రాఫర్ ఆంటోనీ టిరా దాన్ని తన కెమెరాలో క్లిక్‌మనించాడు. 

దానిని చూసి కొత్త రకమైన జంతువు అనుకున్నానని..  కొంత అయోమయానికి లోనై, కొద్ది సేపటికి దానిని జీబ్రాగా గుర్తించానని ఆంటోని తెలిపారు. ఆ జీబ్రాకు ఆంటోని పెట్టిన పేరు టిరా. అత్యంత అరుదైన ఈ జీబ్రాను మాసయ్ మరా వన్య సంరక్షణ విభాగం తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. దీంతో ఈ జీబ్రా ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై జియోగ్రఫిక్ విభాగం స్పందించింది. కొన్ని జంతువుల్లో ఇలా చారల మధ్య వ్యత్యాసం కనిపించడం జన్యు పరివర్తనలో అత్యంత అరుదైన అంశమని పేర్కొంది.