గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ఇంకా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటించింది. అలాగే భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాదు నగరంలో నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులను మూడు రోజుల పాటు రద్దు చేశారు. 34 రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణీకులు దీనిని గమనించాలని కోరారు. కాగా, వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, చిన్నపిల్లలున్న వారు జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది.