గేదెలపై ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం.. కేసు నమోదు! - MicTv.in - Telugu News
mictv telugu

గేదెలపై ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం.. కేసు నమోదు!

October 20, 2020

nbgnfgnb

ఎన్నికల సమయంలో ఓటర్ మహాశయులను ఆకర్షించడానికి అభ్యర్థులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. చిత్ర విచిత్ర పనులు చేస్తూ ఉంటారు. సెలూన్ షాప్‌లోకి వెళ్తే కత్తెర తీసుకుని కటింగ్ చేస్తారు. టిఫిన్ సెంటర్‌ వెళ్తే గంటె తీసుకుని దోషాలు వేస్తారు. ఇస్త్రీ డబ్బా దగ్గరికి వెళ్తే ఇస్త్రీ చేస్తారు. మురికి వాడల్లో పిల్లకు స్నానాలు పోస్తారు. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నికల సమయాల్లో చూస్తూ ఉంటాం.

ఇక మరికొన్ని రోజుల్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ తరహా దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి అక్కడి అభ్యర్థులు వింత వింత పనులు చేస్తున్నారు. తాజాగా గయా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి గేదెపై ఊరేగుతూ ప్రచారం చేశాడు. గేదెపై ఆయన చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు ఆశ్చర్యంతో వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి పోలీసులకు సైతం చేరాయి. దీంతో ఎన్నికల ప్రచారానికి జంతువులను హింసించారనే నెపంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అతనిపై జంతు సంరక్షణ చట్టంతో పాటు.. కరోనా వైరస్ నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. తరువాత అతడు ఎలాగోలా బెయిల్‌పై విడుదలై వచ్చి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇలాంటి సంఘటనే బహదరాపూర్ నియోజకవర్గంలో కూడా జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్ అనే రైతు నామినేషన్ వేసేందుకు గేదెపై ఊరేగుతూ వచ్చాడు. తాను రైతుబిడ్డనని, తన వద్ద కూర్చోడానికి కుర్చీ కూడా లేదని తెలిపాడు. రైతుకు గేదెలు, ఆవులు, ఎద్దులే సంపద అని వెల్లడించాడు. ఇతనిపై కూడా పోలీసులు జంతు సంరక్షణ చట్టంతో పాటు కరోనా వైరస్ నియమావళి ఉల్లంఘ కేసులు నమోదు చేశారు. వీరు గేదెలపై ఊరేగుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీ ప్రచారానికి గేదెలను ఎందుకు హింసిస్తున్నారని నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.