అభ్యర్థుల్లారా..ఒక్కో పోస్టుకు 666 మంది పోటీ: టీఎస్‌పీఎస్సీ - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా..ఒక్కో పోస్టుకు 666 మంది పోటీ: టీఎస్‌పీఎస్సీ

June 1, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఎప్రిల్ నెలలో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 503 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైన రోజు నుంచి మంగళవారం వరకు 3,35,143 మంది ఆప్లై చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ 503 ఉద్యోగాలకు సంబంధించి అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ఇప్పటివరకూ వచ్చిన గ్రూప్-1 దరఖాస్తుల ప్రకారం.. సగటున ఒక్కో పోస్టుకు 666 మంది పోటీ పడుతున్నట్లు (అంటే1:666) అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల గడువును ప్రభుత్వం జూన్ 4 వరకు పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను బట్టి గ్రూప్-1 ఉద్యోగాలకు భారీ పోటీ ఉండనుందని, అభ్యర్థులు కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగాలకు ప్రిపర్ అవుతున్నారని అధికారులు వివరాలు వెల్లడించారు.

మరోపక్క గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇదివరకే టీఎస్‌పీఎస్సీ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. పరీక్ష సమయం తక్కువగా ఉండడంతో నిరుద్యోగులు మార్కెట్లో కొన్ని మెటీరియల్స్ అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రిలిమ్స్ పరీక్షకు మరికొద్ది నెలల సమయం ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఎమైనప్పటికి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 ఉద్యోగాలకు భారీ పోటీ నెలకొందని దరఖాస్తులను బట్టి తెలుస్తోంది.