తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. గ్రూప్ -1 ఉద్యోగాలకు సంబంధించి, ఆల్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు బోనఫైడ్ లేకున్నా గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
అధికారులు మాట్లాడుతూ..”. గ్రూప్-1 దరఖాస్తుకు బోనఫైడ్ అవసరం లేదు. విద్యార్హతల సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదు. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించనున్న సందర్భంగా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారన్నది మాత్రమే ముఖ్యం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తులో తెలిపిన వివరాలు వేరుగా ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవు. బోనఫైడ్ సర్టిఫికెట్‌కు బదులు లోకల్ ఏరియా లేదా ఇతర సర్టిఫికెట్లు చూపిస్తే సరిపోతదని కొందరు భావిస్తున్నారు. అది కేవలం అపోహ మాత్రమే. ఏమైనా సందేహాలు ఉంటే 040-22445566ను సంప్రదించండి. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే [email protected] ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోండి” అని వారు తెలిపారు.
మరోపక్క గ్రూప్-1 దరఖాస్తుల గడువు ఈ నెల 31న ముగుస్తుంది. ఇప్పటివరకు అధికారులు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవటంతో అభ్యర్థుల సందేహాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాన్ని తెలియజేశారు. దరఖాస్తులు మొదలైన రోజు నుంచి నేటి వరకు కొందరు బోనఫైడ్ సర్టిఫికెట్ల కోసం తిరుగుతూనే ఉన్నారు. ఆ కారణంగానే ఆప్లై చేయాలా? వద్దా? అనే అనుమానంతో ఉన్నారు. ఈ క్రమంలో అధికారులు గ్రూప్-1 దరఖాస్తులకు బోనఫైడ్ అవసరం లేదని స్పష్టం చేశారు.