అభ్యర్థుల్లారా..అక్టోబర్ నుంచే హాల్ టికెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా..అక్టోబర్ నుంచే హాల్ టికెట్లు

September 22, 2022

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు అధికారులు తాజాగా ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. వచ్చే నెల (అక్టోబర్) 9వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో గ్రూప్-1 హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నామని, అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.

టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..”తెలంగాణలో ఇటీవలే 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విడుదలైన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే. మొత్తం 503 ఖాళీలకు గాను రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రిలిమ్స్‌కు సంబంధించి ఒక్కో పోస్టుకు 756 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించనున్నాం. పరీక్షకు నెల రోజులు కూడా సమయం లేదు. ఏర్పాట్లను వేగవంతంగా చేస్తున్నాం” అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక, గ్రూప్-1 పరీక్షకు సంబంధించి..ఎలాంటి అవకతవకలు, లోపాలు జరగకుండా, పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఆయా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఈ గ్రూప్-1 పరీక్షను నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని, ఆయా జిల్లాల అధికారులు పరీక్ష పట్ల ఏలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని,ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి నెలలో మెయిన్స్ నిర్వహిస్తామని వివరాలను వెల్లడించారు.