Candidates..hall tickets from today..these are the precautions..
mictv telugu

అభ్యర్థుల్లారా..ఈరోజు నుంచే హాల్ టికెట్లు..జాగ్రత్తలు ఇవే..

August 18, 2022

 

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 28వ తేదీన (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో జరగనున్న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి, పోలీసు నియామక మండలి అధికారులు అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈరోజు నుంచే జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాస రావు మాట్లాడుతూ..” పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈ నెల 28న రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తాం. ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,801 కేంద్రాలు ఏర్పాటు చేశాం. అభ్యర్థులు 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్ టికెట్లు www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే [email protected] tslprb.inకు ఈ మెయిల్ లేదా 9393711110, 9391005006కు ఫోన్ చేయండి” అని ఆయన అన్నారు.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

1. హాల్‌టికెట్‌ను రెండు వైపులా ఏఫోర్ సైజ్ ప్రింట్ (కలర్‌ అవసరం లేదు) తీసుకోవాలి.
2. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసిన ఫొటోనే హాల్‌టికెట్‌పై అతికించాలి.
3. వేరేదాన్ని అతికించినా, హాల్‌టికెట్ అసమగ్రంగా ఉంటే అనుమతించరు.
4. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
5. పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు.
6. పరీక్ష కేంద్రాల వద్ద సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఉండదు.
7. చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ ఉప కరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు.
8. హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.