అభ్యర్థుల్లారా..హాల్ టికెట్లు ఆగస్టు 1న విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా..హాల్ టికెట్లు ఆగస్టు 1న విడుదల

July 5, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ సర్కార్ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకొని, ప్రిలిమినరీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సోమవారం అధికారులు హాల్ టికెట్లకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.

టీఎస్ఎల్బీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..”తెలంగాణవ్యాప్తంగా సబ్ ఇన్స్పెక్టర్, తత్సమాన పోస్టులకు ఆగస్టు 7 (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు ప్రాథమిక రాత పరీక్షను నిర్వహిస్తాం. ఇక, పోలీస్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టు 21న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహిస్తాం. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే, ఈ ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఆగస్టు 1న విడుదల అవుతాయి. ప్రతి అభ్యర్థి తమ తమ హాల్ టికెట్లను టీఎఎల్ఫీఆర్బీ వెబ్‌సైట్ ‘www.tslprb.in’ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణలో ఎస్సై ఉద్యోగాలకు 2.45 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 6.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజునే అధికారులు ప్రిలిమ్స్‌కు సంబంధించిన తేదీలను నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఆ ప్రకారమే.. ఆగస్టు 7వ తేదీన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు 21వ తేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తామని మరోసారి అభ్యర్థులకు తెలియజేశారు.