Candidates..One physical test for SI and Constable
mictv telugu

అభ్యర్థుల్లారా..ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు ఒకేసారి ఫిజికల్ టెస్ట్

July 11, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ నియామక మండలి అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఆగస్టులో జరగబోయే ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తాజాగా అధికారులు తెలిపారు. అయితే, ప్రిలిమ్స్‌లో పాసైన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది? కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు వేరు వేరుగా ఉంటాయా? కలిపి ఉంటాయా? అనే అనుమానాలు అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఈ విషయంపై తాజాగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఓ ప్రకటన విడుదల చేశారు. “ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్డులు వేర్వేరుగా దరఖాస్తులు చేసుకున్నారు. కొంతమంది అభ్యర్థులు వేర్వేరు మొబైల్ నంబర్లతో చేసుకొన్న అప్లికేషన్లను మెర్జ్ చేసింది. అభ్యర్థి మొదట ఏ మొబైల్ నంబర్‌తో దరఖాస్తు చేసుకున్నారో అదే యూజర్ ఐడీగా ఉంటుంది. రెండు పోస్టులకు వేర్వేరుగా పరుగు పందెం, ఇతర ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారన్న ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు వేర్వేరు మొబైల్ నంబర్లతో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, అన్ని రకాల పోస్టులకు ఒకేసారి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తాం. ఎస్సైకి, కానిస్టేబుల్‌కి వేరు వేరుగా ఫిజికల్ టెస్ట్‌ ఉండదు. రెండు పోస్టులకు ఒకేసారి ఫిజికల్ టెస్టు ఉంటుంది. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, పరీక్షలకు సిద్దం కావాలి” అని పోలీసు నియామక మండలి పేర్కొంది.

ఈ ఫిజికల్ టెస్టుల విషయంలో అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఏమైనా అభ్యంతరాలు ఉన్నా వెంటనే 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇక, ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 1వ తేదీ నుంచి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవాలని అధికారులు తెలిపారు.