Candidates..These are the qualifications for Anganwadi jobs..
mictv telugu

అభ్యర్థుల్లారా..అంగన్‌వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఇవే..

August 14, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్ పోస్టులకు విద్యా అర్హతను పెంచుతూ, ‘మిషన్ సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ అభియాన్ 2.0’ విధివిధానాలను విడుదల చేసింది. విడుదల చేసిన విధివిధానాల్లో.. ”ఇప్పటివరకు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు పదోవ తరగతి అర్హతగా ఉండే. ఇకపై ఈ ఉద్యోగాలకు కనీసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఇక వయసు విషయానికొస్తే.. అంగన్‌వాడీ నియామకాల్లో కనీస వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించాం. గరిష్ట వయసు 35 ఏళ్లుగా ఖరారు చేశాం” అని పేర్కొంది.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ టీచర్, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు కేసీఆర్ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలను కొత్త విధివిధానాలతో పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తులను ప్రారంభించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం విధివిధానాల ప్రకారం..”ఈ పోస్టుల్లో పనిచేసే సిబ్బందిని గౌరవ వేతన వర్కర్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగన్‌వాడీ సర్వీసుల్లో చేరిన మహిళలకు పదవీ విరమణ వయసు ఖరారు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చని తెలిపింది. అయితే 65 ఏళ్ల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీసులో ఉండకూడదని వెల్లడించింది. 50 శాతం పదోన్నతులతో భర్తీ.. కొత్తగా చేపట్టే నియామకాల్లో 50 శాతం అంగన్‌వాడీ టీచర్ పోస్టులను అయిదేళ్ల అనుభవం కలిగి, ఆయాలుగా పనిచేస్తున్న వారితో భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్ పోస్టుల్లో 50 శాతం పోస్టులను అయిదేళ్ల సర్వీసు ఉన్న అంగన్ వాడీ టీచర్లతో భర్తీ చేయాలి. ఈ పోస్టులకు నిర్ణయించిన విద్యార్హతలు, సర్వీసు నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలి. అంగన్‌వాడీ సూపర్‌వైజర్, టీచర్, అయా పోస్టుల భర్తీలో రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి” అని తెలిపింది.

తెలంగాణలో మొత్తం 5,111 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను, అర్హతలు, దరఖాస్తుల తేదీలు, వయసు, ఫీజు వంటి తదితర అంశాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.