అభ్యర్థుల్లారా.. పోలీసు ఉద్యోగాలకు ఈరోజే లాస్ట్‌డేట్ - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా.. పోలీసు ఉద్యోగాలకు ఈరోజే లాస్ట్‌డేట్

May 20, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో విడుదలైన పోలీసు ఉద్యోగాలకు సంబంధించి, ఆల్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగుస్తుందని తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

” పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగుస్తుంది. అభ్యర్థులు ఈరోజు రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గురువారం ఒక్కరోజే లక్ష దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 5.6 లక్షల మంది వివిధ విభాగాల వారీగా దరఖాస్తు చేసుకున్నారు” అని పోలీస్ నియామక మండలి చైర్మన్ శ్రీనివాస రావు తెలిపారు.

ఆరు నోటిఫికేషన్లకు అధికారులు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖ, ప్రత్యేక భద్రతా దళం, రవాణా, ఆబ్కారీ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో 15,644 కానిస్టేబుల్ పోస్టులు, 554 ఎస్పై పోస్టులు, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్, 383 కమ్యూనికేషన్ కానిస్టేబుల్, 63 రవాణా కానిస్టేబుల్, 33 వేలిముద్రల ఏఎస్సై పోస్టులు ఉన్నాయి. వచ్చే మార్చి నాటికి ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.