అభ్యర్థుల్లారా.. ఆగస్టులోనే రాత పరీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా.. ఆగస్టులోనే రాత పరీక్ష

May 7, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అధికారులు పలు విషయాలను తెలియజేశారు. పోలీసు నియామకంలో మొదటగా నిర్వహించే ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) ఆగస్టు నెలలోనే నిర్వహించేలా రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్ఎఆర్‌బీ) సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ నెలలో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుండడంతో వచ్చే మూడు నెలల్లో రాత పరీక్షలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు.

అన్ని సక్రమంగా జరిగితే, జులై చివరి లేదా ఆగస్టు తొలి వారంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, అందుకు సంబంధించిన కార్యచరణను కూడా అధికారులు తయారుచేసే యోచనలో ఉన్నారని పోలీసు నియామక మండలి చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు అన్నారు.

చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ..”అక్టోబరు రెండోవారంలో శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహిస్తాం. నవంబరులోగా ఫలితాలిస్తాం. జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాత పరీక్షలు (మెయిన్స్) ఉంటాయి” అని ఆయన అన్నారు. మరోవైపు నిరుద్యోగులు ఇప్పటికే పోలీసు ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నారు. మరికొందరు తమ వద్ద ఉన్న పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే యత్నంలో అధికారులు ఉన్నారు.