కెప్టెన్ శివ చౌహాన్ సియాచిన్ గ్లేసియర్ లో కాంబాట్ రోల్ లో నియమించబడిన భారత సైన్యంలో మొదటి మహిళా అధికారి. మరి ఆ సైనికురాలి గురించి తెలుసుకోకపోతే ఎలా?
సియాచిన్ గ్లేసియర్ భూమి పై అత్యంత ఎత్తయిన యుద్ధభూమి. ఇక్కడ 1984లో భారత్ పాకిస్థాన్ లు పోరాడాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయి. ఆపరేషన్ మేఘదూత్ ద్వారా భారతదేశం వ్యూహాత్మక ఎత్తులను ఎన్నో నియంత్రించగలిగింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 5, 800 మీటర్లు (15,600 అడుగులు) ఎత్తులో ఉంది.
చౌహాన్ గురించి..
రాజస్థాన్ రాజధాని నగరమైన ఉదయపూర్ లో జన్మించింది. అక్కడే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమెకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఆమె చదువు బాధ్యతను తల్లి తీసుకుంది. చౌహాన్ కి చిన్నప్పటి నుంచి భారతసైన్యంలో చేరాలని కోరిక. చౌహాన్ ఉదయపూర్ లోని ఎన్ జేఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. మే 2021లో చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) నుంచి పట్టభద్రురాలైంది. ఇంజినీర్ రెజిమెంట్ లో నియమించబడింది.
కష్టతరమైన..
కార్ప్స్ లో మూడు విభాగాలున్నాయి. బాంబే సప్పర్స్, బెంగాల్ సప్పర్స్, మద్రాస్ సప్పర్స్. చౌహాన్ బెంగాల్ సప్పర్స్ విభాగంలో ఒక భాగమైంది. మూడు నెలల కష్టతరమైన శిక్షణ తీసుకుంది. సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మిలిటరైజ్డ్ జోన్. ఇక్కడ సైనికులు గడ్డ కట్టకుండా, అధిక గాలులతో కూడా పోరాడాల్సి ఉంటుంది. అందుకే సియాచిన్ యుద్ధ పాఠశాలలో చౌహాన్ శిక్షణ పొందింది.
సరిహద్దు మనదే..
సియాచిన్ గ్లేసియర్ పై సరైన నియంత్రణ ఉండాలని భారతదేశం, పాకిస్తాన్ రెండు వ్యాఖానిస్తున్నాయి. ఎందుకంటే ఇది భారతదేశం, పాకిస్తాన్.. రెండింటి సరిహద్దుల్లో చేర్చబడలేదు. 1949 కరాచీ ఒప్పందం, 1972 సిమ్లా ఒప్పందంలో కూడా సియాచిన్ గురించి ప్రస్తావన లేదు. కానీ ఇప్పుడు సియాచిన్ గ్లేసియర్ ని మాత్రం భారతదేశం నియంత్రిస్తుంది. వివిధ సవాళ్లను ఎదుర్కొని, అచంచలమైన నిబద్ధతో శిక్షణను పూర్తి చేసిన కెప్టెన్ శివ చౌహాన్ మొదటి మహిళా అధికారిగా అడుగు పెట్టింది. అందుకే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చౌహాన్ పోస్టింగ్ గురించి ‘ప్రోత్సహాకరమైన సంకేతం’ అంటూ ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.