కరాచీ యూనివర్సిటీలో కారు బాంబు పేలుడు.. నలుగురు చైనీయుల మరణం - MicTv.in - Telugu News
mictv telugu

కరాచీ యూనివర్సిటీలో కారు బాంబు పేలుడు.. నలుగురు చైనీయుల మరణం

April 26, 2022

పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో కారు బాంబు పేలుడు సంభవించింది. కరాచీ యూనివర్సిటీ క్యాంపస్‌లో కన్ఫ్యూషియస్ అధ్యయన కేంద్రం వద్ద ఈ పేలుడు జరిగింది. బాంబు పేలుడు సమయంలో కారు వద్ద ఎనిమిది మంది ఉండగా, నలుగురు చైనీయులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతులు చైనా భాషను నేర్పించడానికి వచ్చిన అధ్యాపకులని తేలింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు బాంబు పేలుడుకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా చైనా పాకిస్తాన్‌లో వివిధ వ్యాపారాలు, ప్రాజెక్టుల పనుల కోసం తన పౌరులను పంపింది. అయితే ఈ తీరు నచ్చని కొన్ని ఉగ్రవాద సంస్థలు చైనీయులే లక్ష్యంగా పలు మార్లు బాంబు దాడులకు పాల్పడ్డాయి. గతేడాది బలూచిస్తాన్‌లో జరిగిన దాడిలో పలువురు చైనీయులు మరణించారు. కాగా, ఈ దాడికి తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.