నమ్ముకున్న కారు డ్రైవర్ నట్టేట ముంచాడు. ఏకంగా రూ.7 కోట్ల రూపాయలకు టోకరా వేశాడు. కారులో వజ్రాభరణాలు వదిలేసి వెళ్ళగా..వాటితో పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్సాఆర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది.
పూర్తివివరాలు చూస్తే.. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఆభరణాల వ్యాపారం చేసే రాధిక నివాసం ఉంటున్నారు. ఆమెకు వచ్చిన ఆర్డర్లు ప్రకారం ఆభరణాలను సప్లై చేస్తుంటారు. ఈ క్రమంలోనే అదే అపార్ట్ మెంట్ లో ఉండే అనూష రూ.50 లక్షలు విలువ చేసే ఆభరణాలను ఆర్డర్ ఇచ్చారు. ఆమె బంధువల ఇంటి వద్ద ఉండడంతో అక్కడికి పంపించమని కోరారు. దీంతో సేల్స్‌మెన్, కారు డ్రైవర్‌తో ఆభరణాలను అనూష చెప్పిన మధురానగర్ లోకేషన్‌కి రాధిక పంపారు. ఆమెకు సంబంధించిన నగలుతో పాటు సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జువెల్లర్స్‌కు ఇవ్వాల్సిన రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలు కారులో తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్నాక అనూషకు సంబంధించిన నగలను సేల్స్ మెన్ ఆమెకు అప్పగించేందుకు తీసుకువెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి డ్రైవర్ శ్రీనివాస్ కనబడ లేదు. ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో రూ.7కోట్ల విలువ చేసే నగలుతో ఉడాయించాడని భావించి విషయాన్ని రాధికకు తెలియజేశాడు సేల్స్ మెన్. ఆమె ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.