నా కారునే అపుతావా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై డ్రైవ‌ర్ దాడి - MicTv.in - Telugu News
mictv telugu

నా కారునే అపుతావా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై డ్రైవ‌ర్ దాడి

May 3, 2022

ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్ర‌మించడమే కాకుండా.. అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్నాడో కారు డ్రైవ‌ర్. కారు ఆపమన్నందుకు కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు కురిపించాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ ఘటన జరిగింది. భీమవరం గునుపూడి ప్రాంతానికి చెందిన బొబ్బనపల్లి సంతోష్ ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ గునుపూడిలో కేబుల్ పని చేసుకుంటున్న వ్యక్తిని గుద్ది, బైక్ పై వెళుతున్న మరో వ్యక్తిని గాయపరచి ఆపకుండా వెళ్లాడు. దీనిపై వీరమ్మ పార్క్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీశ్ కుమార్‌కు సమాచారం అందింది.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుమార్.. ఇంకెవరికైనా ప్రమాదం జరిగే ముప్పు ఉందని ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే కారు డ్రైవర్‌‌ ఆపకుండా ముందుకెళ్లాడు. కొంచెం ముందుకు వెళ్లాక బ్రేక్‌ వేసి కారు నిలిపి.. కానిస్టేబుల్ వైపు దూసుకొచ్చి విచ‌క్ష‌ణా ర‌హితంగా ప్ర‌వ‌ర్తించాడు. నా కారునే ఆపుతావా అంటూ గొడవకు దిగి.. కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు గుద్దాడు. అతడి దాడిలో కానిస్టేబుల్‌కు మెడ, చేతి భాగంలో గాయాలయ్యాయి.దీనిపై సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్ తెలిపారు.