హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు చలానా! - MicTv.in - Telugu News
mictv telugu

హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు చలానా!

October 29, 2020

helmet

రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలు చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిమానాలను భారీగా పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌లో వింత సంఘటన జరిగింది. ఏపీ పోలీసులు కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధించారు. విశాఖలోని జ్ఞానాపురానికి చెందిన తుల్లి రమేష్ సెల్‌ఫోన్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 

గత నెల 14న ఏపీ31క్యూ444 నంబరు కారులో మద్దిలపాలెం వైపు వెళ్లారు. తర్వాత ఆయన సెల్‌ఫోన్‌కు జరిమానా మెసేజ్‌ వచ్చింది. కారు నడిపేటప్పుడు హెల్మెట్‌ పెట్టుకోలేదని అందులో ప్రస్తావించారు. తన మొబైల్‌కు వచ్చిన మేసేజ్‌లో కారు నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోలేదని ఉండటంతో రమేష్ షాక్ అయ్యాడు. అందుకు రూ. 135 జరిమానా చెల్లించాలని అందులో ఉంది. ఈ మెస్సేజ్ ను నమ్మని రమేష్ తర్వాత ఆన్‌లైన్‌లోనూ చెక్ చేసుకోగా.. హెల్మెట్ పెట్టుకోని కారణంగానే జరిమానా విధించినట్లు తేలింది. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఈ చలానా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఏపీలో జరిమానాలు ఇలా ఉన్నాయి… 

 

* వేగంగా బండి నడిపితే – రూ. 1000

* సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000

* రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

* వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750

* సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750

* అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000

* అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000

* డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000

* రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000

* రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000

* పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000

* ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

* వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000

* ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000

* అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

* రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి – రూ. లక్ష