కరీంనగర్‌ కారు ప్రమాదం..టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం  - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్‌ కారు ప్రమాదం..టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం 

February 17, 2020

cfnb

కరీంనగర్‌లోని కాకతీయ కాలువలో బయటపడిన కారుతో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కారు ప్రమాదానికి గురైంది ఆయన చెల్లెలు రాధిక, భర్త సత్యనారాయణగా గుర్తించారు పోలీసులు. దీంతో ఆయనకు సమాచారం అందించడంతో మృతిచెందింది తమ కుటుంబ సభ్యులేనని గుర్తించారు. కూతురు సహస్త్రతో కలిసి వీరు ముగ్గురు కారులో బయలుదేరి ప్రమాదానికి గురైనట్టుగా అనుమానిస్తున్నారు. 

20 రోజులుగా ముగ్గురు వ్యక్తుల ఆచూకీ లేకపోయినా మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంపై పలు అనుమానాలకు దారి తీసింది. ఇది ప్రమాదమా..? లేక కావాలనే ఎవరైనా ప్రమాదంగా చిత్రీకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కనిపించకుండా పోతే ఇంత కాలం ఎందుకు వెలుగులోకి రాలేదన్నది ఆసక్తిగా మారింది. అయితే రాధిక కుటుంబం తరుచూ విహారయాత్రలకు వెళ్తుందని.. ఇప్పుడు కూడా అలాగే వెళ్లారని అనుకున్నట్టుగా వెల్లడించారు. కారులో రెండు మృతదేహాలు మాత్రమే ఉండటంతో సహస్త్ర కోసం గాలింపు ప్రారంభించారు. 

కాగా ఆదివారం నుంచి కాకతీయ కాలువకు నీటి సరఫరా నిలిపి వేయడంతో అందులోంచి కారు బయటపడిన సంగతి తెలిసిందే. కారు నంబర్ ఆధారంగా ఎమ్మెల్యే బంధువులుగా గుర్తించారు. వీరంతా కరీంనగర్ బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలను దర్యాప్తు పూర్తైన తర్వాత తెలుస్తుందని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.