చంద్రుడిపై కార్ల రేస్..  - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రుడిపై కార్ల రేస్.. 

December 2, 2020

bgbfg

కార్ల పందెం చూడ్డానికి ఎంతో థ్రిల్లింగా ఉంటుంది. ట్రాక్‌పై రాకెట్ వేగంతో దూసుకెళ్లే కార్లు గుండెల్లో దడ పుట్టిస్తాయి. కార్ల రేసులపై పందేలు కాసే వాళ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ రేసులన్నీ భూమి పైనే జరుగుతాయని కూడా చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పాల్సిన సంగతి మరొకటి ఉంటుంది. కార్ల రేసును భూమిపై కాకుండా చందమామపై జరపబోతున్నారు. 

వచ్చే ఏడాది.. అంటే 2021లో జాబిల్లిపై తొలిసారి కార్ల రేస్ నిర్వహించనున్నారు. నేలపై తిరిగే టన్నుల బరువున్న కార్లతో కాకుండా చిన్న చిన్న కార్లతో రేస్ ఉంటుంది. వీటిని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేస్తారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో  పోటీ ఉంటుందని రేస్ నిర్వహిస్తున్న మూన్ మార్క్ అనే కంపెనీ తెలిపింది. పందెంలో పాల్గొనే కార్లు ఎలా ఉండాలో అమెరికా విద్యార్థులు డిజైన్ చేస్తున్నారు. ఒక్కో కారు బరువు రెండున్నర కేజీలు ఉంటుంది. వీటిని ఉపగ్రహం సాయంతో చంద్రుడిపై దింపి పరిగెత్తిస్తారు. కార్ల బరువు, వాటిని తీసుకెళ్లే ఉపగ్రహం బరువు కలిపి మొత్తం 8 కేజీలను జాబిల్లిపై తీసుకెళ్తారు. దీని కోసం ఏకంగా రూ.73 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 

స్పేస్‌ ఎక్స్‌ కంపెనీకి చెందిన ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా కార్లను, ఉపగ్రహాన్ని చంద్రుడిపైకి తీసుకెళ్తారు. అక్కడి ఓషియన్‌ ప్రోసెల్లారమ్‌ ప్రాంతంలో రేస్ ఉంటుంది. రాళ్లురప్పలు లేని మైదానం అంది. అందుకే దాన్ని ఎంపిక చేసుకున్నారు. కార్లను నేలపై నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. రేసును ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. రేస్‌ను చూడాలంటే ముందే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలా వచ్చే డబ్బును ప్రాజెక్టు కోసం ఉపయోగిస్తారట. ఐడియా బాగానే ఉందిగానీ, ఇది ఎంతవరకు సాధ్యమని నిపుణులు అనమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమో, అసాధ్యమో.. ముందు పని ప్రారంభించాలి కదా అంటోంది మూన్ మార్క్ సంస్థ. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది కదా.