Carlos Alcaraz's record at the age of 19..with the first trophy
mictv telugu

19 ఏళ్లకే కార్లోస్ అల్కరాజ్ రికార్డ్..తొలి ట్రోఫితోనే

September 12, 2022

19 ఏళ్ల వయసున్న స్పానిష్ ఆటగాడు కార్లస్ అల్కరాజ్ రికార్డ్ సృష్టించాడు. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఘన విజయం సాధించి, తొలి ట్రోఫీతోనే చరిత్రను తిరగరాశాడు. వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లో నిన్న జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రెండు యువకెరటాలు తలపడ్డాయి. చివరికి స్పానిష్ ఆటగాడు కార్లస్ అల్కరాజ్ విజయం సాధించాడు.

మొత్తంగా మూడున్నర గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో.. అల్కరాజ్‌దే పైచేయి అయింది. 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో విజయం సాధించి తొలి యూఎస్ ఓపెన్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో 2005 తర్వాత యూఎస్ ఓపెన్‌ను దక్కించుకున్న అత్యంత పిన్నవయస్కుడైన ఆటగాడిగా కార్లస్ అల్కరాజ్ రికార్డులకెక్కాడు. అంతకుముందు 2005లో రఫేల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్) గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి, 19 ఏళ్ల వయసులోనే ఆ ఘనత అందుకున్నాడు. మళ్లీ ఇప్పుడు అల్కరాజ్‌ ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును అందుకున్న తొలి ఆటగాడిగా కూడా కార్లోస్ అల్కరాజ్ చరిత్రకెక్కాడు.

 

టైటిల్ కోసం..ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా చివరివరకు పోరాడారు. తొలిసెట్‌లో అల్కరాజ్‌ 6-4 తేడాతో రూడ్‌పై పైచేయి సాధించాడు. అయితే, రెండో సెట్‌లో రూడ్‌ విజృంభించి 6-2తో రెండో సెట్‌ గెలిచి స్కోర్‌ సమం చేశాడు. ఇక, మూడో సెట్‌కోసం ఇద్దరు తీవ్రంగా శ్రమించారు. ప్రత్యర్థికి చాన్స్‌ ఇవ్వకుండా ఇద్దరు పోరాడటంతో 6-6తో టైబ్రేకర్‌కు మల్లింది. ఇందులో 7-1 (7-6)తో అల్కరాజ్‌ విజయం సాధించాడు. చివరిదైన నాలుగో సెట్‌లో అల్కరాజ్‌ 6-3తో ముందంజలో నిలిచాడు. దీంతో తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడాడు.