కరోనాపై కామెంట్..  మోహన్‌లాల్‌పై కేసు.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై కామెంట్..  మోహన్‌లాల్‌పై కేసు..

March 27, 2020

Case against Mohanlal for encouraging coronavirus myths

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ను నివారించేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం కరోనా వైరస్ గురించి తప్పుడు వార్తలు షేర్ చేయడం గర్హనీయం. ఇప్పటికే రజినీకాంత్, పవన్ కళ్యాణ్‌లు చేసిన తప్పుడు కరోనా వైరస్ సమాచారాన్ని ట్విట్టర్ సంస్థ డిలీట్ చేసిన సంగతి తెల్సిందే. 

తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ ఇంటర్వ్యూలో కరోనా గురించి తప్పుడు సమాచారం చెప్పారు. మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..’అందరూ కలిసి చప్పట్లు కొట్టడం వలన కరోనా వైరస్‌ చనిపోయే అవకాశం ఉంది. చప్పట్ల శబ్దం నుంచి ఓ మంత్రం లాంటిది పుట్టుకొస్తుంది. దీని వలన బ్యాక్టీరియా, వైరస్‌లు చనిపోయే అవకాశం ఉంటుంది. చప్పట్లు కొట్టి అందరం వైరస్‌ను నియంత్రిద్దాం’ అని అన్నారు. మోహన్ లాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు మోహన్ లాల్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీను అనే వ్యక్తి కేరళ మానవ హక్కుల కమిషన్‌లో మోహన్‌ లాల్‌పై ఫిర్యాదు చేశాడు. మోహన్‌ లాల్‌పై ఫిర్యాదు చేసిన కాపీని శ్రీను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఈ ఫిర్యాదు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. దాంతో మోహన్ లాల్ అభిమానులు కేరళ మానవ హక్కుల కమిషన్‌ను స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై కేరళ మానవ హక్కుల కమీషన్ స్పందిస్తూ..మోహన్ లాల్‌పై ఇంకా కేసును నమోదు చేయలేదని.. శ్రీను ఇచ్చిన ఫిర్యాదును ఇంకా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.