తెలంగాణ హైకోర్టులో గోపాల గోపాల.. ప్రతివాదిగా దేవుడు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ హైకోర్టులో గోపాల గోపాల.. ప్రతివాదిగా దేవుడు

January 21, 2020

Gopala Gopala.

చాలా సందర్భాల్లో సినిమాల్లో రియాల్టీకి దూరంగా సన్నివేశాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు అందులో చూపించినటువంటి అంశాలు నిజ జీవితంలో కూడా ఎదురై అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. గోపాల గోపాల సినిమాలో జడ్జి దేవుడిని ప్రతివాదిగా చేర్చినట్టుగానే తెలంగాణ హైకోర్టు కూడా దేవుడిని ప్రతివాదిగా చేర్చుతూ సంచలన కేసును విచారణకు స్వీకరించింది.సినిమాల్లో దేవుళ్లపై కేసులు పెట్టడం.. వారిని ప్రతివాదులుగా చేర్చడం చూసిన వారికి నిజ జీవితంలో ఇలా జరగడంతో అందరిని ఆశ్చర్యంలోకి పడిపోయారు. 

అమీన్‌పూర్‌లోని మాధవపురి హిల్స్‌లో నిర్మించిన ఆలయం వివాదంలో చిక్కుకుంది. విష్ణు పంచాయతన దేవాలయం అక్రమంగా నిర్మించారంటూ 2018లో రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశాడు. పార్కు భూమిని కబ్జా చేసి ఆలయాన్ని నిర్మించారని వెంటనే దాన్ని కూల్చివేసేలా తీర్పు ఇవ్వాలంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వెంకటేశ్వర స్వామిని దీంట్లో ప్రతివాదిగా చేర్చారు. సినిమాలో చూపించినట్టుగా దేవుడు కోర్టుకు హాజరు కాలేనందున ఆలయ నిర్వాహకులు హాజరుకావాలని సూచించారు. ఫిబ్రవరి 7న దీనిపై విచారణకు రానున్నారు. 

కొన్ని రోజుల క్రితం మాధవపురి హిల్స్ ఆలయంలో వేంకటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి, శివుడు, సూర్యనారాయణ,ఆంజనేయ స్వామితో కూడిన దేవాలయాలు  నిర్మించారు. ఇవన్ని అక్రమ కట్టడాలే అంటూ కోర్టులో పిల్ దాఖలైంది. అయితే ఆలయ స్థలాన్ని కబ్జాచేయలేదని దాని నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని రకాల అనుమతులతోనే వాటిని నిర్మించామని కమిటీ చెబుతోంది. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది.