జయప్రద ‘ఖాకీ అండర్ వేర్’ ధరిస్తుంది.. ఆజం ఖాన్ అనుచిత వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

జయప్రద ‘ఖాకీ అండర్ వేర్’ ధరిస్తుంది.. ఆజం ఖాన్ అనుచిత వ్యాఖ్యలు

April 15, 2019

ఇటీవల బీజేపీలో చేరిన అలనాటి నటి, మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా అదే స్థానం నుంచే సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఎంపీగా గెలిచారామె. అయితే, రాంపూర్ నుంచి ఈసారి ఎస్పీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌ బరిలో ఉన్నారు. దీంతో ఇరువురూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఈ విమర్శలు తారా స్థాయి చేరాయి. ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో అజంఖాన్ మాట్లాడుతూ.. గతంలో జయప్రదను తానే రామ్‌పూర్ తీసుకొచ్చానని, ఆమెను ఎవరూ తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. అంతేకాదు ఆమెను తానెలా కాపాడానో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ఆమె నిజస్వరూపం తెలుసుకునేందుకు 17 ఏళ్లు పట్టిందని, కానీ జయప్రద ఖాకీ రంగు అండర్ వెర్ వేసుకుందనే విషయాన్ని 17 రోజుల కిందట గ్రహించానని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ సంఘటనను గుర్తు చేశారు. ఆజం ఖాన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..‘ఢిల్లీలోని ఓ దేవాలయానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి, అక్కడ దైవదర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడున్న ఓ దానవుడిని అంతం చేయడానికి రామ్‌పూర్ వెళ్లాలని వ్యాఖ్యానించారు.. దానవుడు అంటే తనకు అర్థం తెలిక మా హిందూ మిత్రులను అడిగితే రాక్షసుడని వారు చెప్పారు.. నేను రాక్షసుడ్నే కాబట్టి చంపేయండి.. నా గుండెలకు 100 బుల్లెట్లను గురిపెట్టండి.. బయటవారిని పంపడం కాదు దుమ్ముంటే తనను చంపడానికి ఆమెకే అవకాశం ఇస్తున్నాను’ అని సవాల్ విసిరారు. ఇక ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు అవమానకరమైనవని, ఆయనకు నోటీసులు పంపించనున్నామని, ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరనున్నామని ఆమె అన్నారు.