‘ఆమ్రపాలి’ అవినీతి.. ధోనిపై కేసు నమోదు.. - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆమ్రపాలి’ అవినీతి.. ధోనిపై కేసు నమోదు..

December 2, 2019

case filed against mahendra singh dhoni in amrapali scam

మాజీ టీంఇండియా సారథి మహేంద్ర సింగ్ ధోనిపై ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఆమ్రపాలి కుంభకోణ బాధితులు ధోనిపై కూడా కేసు పెట్టారు. ఆమ్రపాలి సంస్థకు ధోని అంబాసిడర్‌గా పనిచేశారని..ఆయనపై నమ్మకంతోనే తాము ప్లాట్లు కొన్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ధోనికి కూడా భాగం ఉందని తెలిపారు. ఆమ్రపాలి గ్రూప్ సకాలంలో ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో విఫలం కావడంతో సుమారు 46000 మంది ప్లాట్ కొనుగోలుదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

కంపెనీ డైరెక్టర్లతో పాటు ఆమ్రపాలీ గ్రూపుకు అనుబంధ సంస్థలపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కంపెనీకి చెందిన సీఎండీ అనిల్‌శర్మ, కంపెనీ డైరక్టర్లు శివప్రియ, అజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ధోని కూడా తనకు రావాల్సిన రూ.40కోట్ల బాకీని ఆమ్రపాలీ గ్రూప్ ఎగ్గొట్టిందని సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2016 వరకూ ఆమ్రపాలి గ్రూప్‌కు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అందుకు పారితోషికంగా తనకు రావాల్సిన రూ.40కోట్లు ఇవ్వాల్సి ఉందని పలు దఫాలుగా అడుగుతూనే ఉన్నా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ధోని కోర్టుకు తెలిపాడు.