దేశంలో తొలిసారి.. వాట్సాప్, టిక్‌టాక్‌పై హైదరాబాద్‌లో క్రిమినల్ కేసు  - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో తొలిసారి.. వాట్సాప్, టిక్‌టాక్‌పై హైదరాబాద్‌లో క్రిమినల్ కేసు 

February 27, 2020

Nampally Court.

దేశవ్యాప్తంగా సీఏఏపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ఏవేవో వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టిక్‌టాక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ యాజమాన్యాలపై దేశంలోనే మొదటిసారి క్రిమినల్‌ కేసు నమోదైంది. సీనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మతపరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్‌ చేస్తున్నారని నాంపల్లి కోర్టులో  ఆయన పిటిషన్‌ వేశారు. ఇండియన్ టిక్‌టాక్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో పాక్‌కు చెందినవారు ఉన్నారని పిటిషన్‌లో తెలిపారు. సీఏఏ, ఎన్‌ఆర్సీని వ్యతిరేకిస్తున్న వీడియోలు పాక్‌ వాళ్లు పెడితే ఇండియాలో పెట్టినట్లు వైరల్‌ చేస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 153(A), 121(A), 294, 505, రెడ్ విత్ 156(3) కింద.. యాప్‌ల యాజమాన్యాలపై  సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల్లో క్రైమ్‌ పోలీసులు వారికి నోటీసులు ఇవ్వనున్నారు.

ఈ విషయమై తొలుత జర్నలిస్టు శ్రీశైలం హైదరాబాద్ నగర పోలీస్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ మహంతిని కలసి ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మత పరమైన సున్నిత అంశాలను వైరల్ చేసి ప్రజలను రెచ్చగొడుతున్న కొన్ని వాట్సాప్, ట్విటర్, టిక్ టాక్ గ్రూప్‌ల పోస్టింగులను జతచేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన కోర్టు సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు రిఫర్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153A, 121A, 124, 124A, 294, 295A, 505, 120B, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66A కింద ట్విటర్, వాట్సాప్, టిక్ టాక్‌లపై కేసు నమోదైంది.