దొంగ కేసు పెట్టాలంటే శ్రీధర్  దగ్గర నేర్చుకోవాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

దొంగ కేసు పెట్టాలంటే శ్రీధర్  దగ్గర నేర్చుకోవాల్సిందే..

October 23, 2017

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల్ శ్రీధర్ బాబుపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని పోలీసు కేసుల్లో ఇరికించాలనే కుట్ర చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు… కరీంనగర్ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో 9 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన యత్నాన్ని స్థానిక టీఆర్‌ఎస్ ఎంపీటీసీ కవిత భర్త, ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుకున్నారని, దీంతో అప్పటి నుంచి అతనిపై శ్రీధర్‌బాబు కక్షగట్టారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో వినాయక చవితిరోజు తనపై కేసు పెట్టేందుకు ప్రయత్నించారని కిషన్ చెప్పారు.  ఇందులో భాగంగా సుదర్శన్ అదే గ్రామానికి చెందిన భార్గవ్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి తన ఇంట్లో గంజాయి ప్యాకెట్లు వేయాలని సూచించారని అన్నారు.  ఈ విషయం తెలుసుకొని అప్రమత్తమైన  తాను నగర పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశానన్నాడు. దానిపై స్పందించిన సదరు అధికారి నుదర్శన్, భార్గవ్‌లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని జరిగిన విషయంపై ఆరా తీశారు.

దోమలగూడలోని శ్రీధర్‌బాబు ఇంట్లోనే సుదర్శన్, భార్గవ్‌తో కలిసి కుట్ర పన్నారని బాధితుడు కిషన్‌రెడ్డి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, భార్గవ్‌పై కేసులు నమోదు చేశారు. కిషన్ రెడ్డి ఇంట్లో గంజాయి  పెట్టాలంటూ శ్రీధర్, సుదర్శన్‌ లు మాట్లాడుకుంటున్న ఆడియో సంభాషణ పోలీసుల చేతికి చిక్కింది. దీంతో వారిద్దరూ అడ్డంగా బుక్కయ్యారు. సుదర్శన్, భార్గవ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తానెలాంటి కుట్రా చేయలేదని, చట్టంతోనే కేసును ఎదుర్కొంటానని శ్రీధర్ చెప్పారు.