మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రేణుకాచౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులను అదుపు చేసే క్రమంలో రేణుకాచౌదరి తన కాలర్ పట్టుకున్నారని పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్రబాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రేణుకా చౌదరిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు అయింది. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కాలర్ పట్టుకోవడంపై రేణుకా చౌదరిపై కేసు ఫైల్ చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఎస్ఐ ఉపేంద్ర ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన రేణుకాచౌదరి.. వెనుకాల నుంచి ఎవరో తోసేశారని, అదుపుతప్పి కిందపడుతుండగా ఎస్ఐ భుజం పట్టుకున్నానని చెప్పారు. ఎస్ఐని అవమానపర్చడం నా ఉద్దేశం కాదని, యూనిఫాంను ఎలా గౌరవించాలో తమకు తెలుసన్నారు. పోలీసుల పట్ల గౌరవం ఉందన్నారు. అసలు తమ చుట్టూ మగ పోలీసులు ఎందుకున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం కక్షసాధింపునకు కేంద్రం వినియోగిస్తోందని గోల్కొండ పోలీస్ స్టేషన్ వద్ద రేణుకా చౌదరి మీడియాతో అన్నారు.