సౌదీ : మదీనా వద్ద ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు.. 150 మందిపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

సౌదీ : మదీనా వద్ద ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు.. 150 మందిపై కేసు

May 2, 2022

అవిశ్వాస తీర్మానం ద్వారా అవమానకర రీతిలో ప్రధాని పదవి నుంచి దిగిపోయిన ఇమ్రాన్ ఖాన్‌కు రాజకీయ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. సౌదీ అరేబియాలోని ప్రసిద్ధ మదీనా వద్ద ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పాక్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవల మదీనాకు వెళ్లిన ఇమ్రాన్ మసీదు నుంచి వెలుపలకు రాగానే కొందరు ప్రజలు ‘ప్రధాని ద్రోహి, దొంగ’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో ఇమ్రాన్ సహా ఆయన పార్టీ నేతలు, గతంలో ఇమ్రాన్ ప్రభుత్వంలో పని చేసిన ముగ్గురు మంత్రులు సహా 150 మందిపై సెక్షన్ 295 ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తానెలాంటి నినాదాలు చేయలేదని ఇమ్రాన్ వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలే స్వచ్ఛందంగా నినాదాలు చేశారని స్పష్టం చేశారు. నినాదాలు చేయాలని తానెవ్వరినీ ప్రోత్సహించలేదని సమాధానమిచ్చారు. ప్రస్తుత పాలకులు ప్రజల ఆగ్రహం ముందు నిలబడగలరా? అని సవాలు చేశారు.