క్రైమ్ వార్తలతో సంచలనాలు సృష్టించిన కేరళ వాసి నందకుమార్‌పై ఎస్సీ, ఎస్టీ, ఐటీ యాక్ట్‌ల కింద పోలీసులు కేసులు పెట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలు, డబ్బు ఆశ పెట్టి నీలి చిత్రాల్లో నటించేలా ఒత్తిడి చేయడం వంటి చేష్టలు చేశాడని అతని వద్ద పనిచేసిన మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలి చిత్రంలో నటించకపోతే మార్ఫింగ్ చేసి నెట్లో పెడతానని బెదిరించాడని, అయినా ఒప్పుకోకపోతే కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, అంతకు ముందు నందకుమార్.. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ నీలి వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ గతంలో కథనం ప్రచురించాడు. దాంతో మంత్రి పోలికలతో ఉన్న తనను నీలిచిత్రంలో నటించేలా చేసి, తద్వారా మంత్రిని బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని చెప్పేవాడని మహిళ పేర్కొంది. అయితే బాధితురాలితో పాటు మరికొందరు ఉద్యోగులు కూడా ఈ తరహా ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ నందకుమార్ వీణా జార్జ్‌పై జుగుప్సాకరమైన ఆరోపణలు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినా, నందకుమార్ తీరు మార్చుకోలేదు. దాంతో అతడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.