Case registered against Pawan Kalyan
mictv telugu

పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

November 12, 2022

పవన్ కల్యాణ్‌పై మరో కేసు నమోదైంది. తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పవన్ పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసారు. ఇటీవల ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ వెళ్లే క్రమంలో కారుపై కూర్చొని నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదు చేసాడు. అతను ప్రయాణించిన కారుతో పాటు అతనిని అనుసరించిన వాహనాలు అతివేగంతో దూసుకెళ్లాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తాను ప్రమాదానికి గురికావల్సి వచ్చిందని పోలీసులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు పవన్‌పై కేసు నమోదు చేసారు. ఎఫ్‌ఐఆర్ నెంబర్ 817/2022గా, ఐపీసీ 336, 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద ఫైల్ చేశారు. పవన్‌తో పాటు అతని డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇతరుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించినందుకు ఐపీసీ 336 సెక్షన్ కింద.. అలాగే రహదారిపై నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన కారణంగా ఐపీసీ 279 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఇప్పటం అనే గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు ఇటీవల వివాదస్పదమైన సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ కోసం కొన్ని ఇళ్లను ధ్వంసం చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై పవన్ కల్యాణ్ వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటం గ్రామం సందర్శించే నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్లలో ర్యాలీగా వెళ్లారు. అయితే ఆ సమయంలో పవన్ ఒక కారు టాప్ మీద కూర్చుని ప్రయాణించడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది.