శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో చిన జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలోని సమతామూర్తి ప్రసాదం ప్యాకెట్లపై కేసు నమోదైంది. ఆశ్రమంలో భక్తులకు విక్రయించే ప్రసాదం ప్యాకెట్లపై తయారు తేదీ, ఎక్స్పైరీ తేదీ ముద్రించలేదంటూ ఓ వ్యక్తి తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేశాడు. అంతేకాక, ప్యాకెట్‌పై ఉన్న బరువుకు, వాస్తవ బరువుకు తేడా ఉన్నట్టు ఈమెయిల్ ద్వారా వినయ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన అధికారులు ఆశ్రమంలో తనిఖీలు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్లు 10,11,12లతో పాటు 8/25 కింద కేసు బుక్ చేసినట్టు తెలిపారు. అయితే ఈ మెయిల్ ద్వారా వచ్చిన సమాచారంతో అధికారులు ఇంత త్వరగా స్పందించి కేసులు నమోదు చేయడంపై పలువురు చర్చించుకుంటున్నారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీ హాజరు కాగా, కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీంతో చినజీయర్ స్వామికి, కేసీఆర్‌కు చెడిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిని జీయర్ గారు కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ప్రసాదంపై కేసు నమోదు కావడం గమనార్హం.