గుర్మీత్ బాబా.. నేరాల డేరా - MicTv.in - Telugu News
mictv telugu

గుర్మీత్ బాబా.. నేరాల డేరా

August 25, 2017

గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా కారణంగా నాలుగు రాష్ట్రాలు మంటల్లో తగలబడిపోతున్నాయి. ఈ బాబాకు ఉన్న విపరీత ప్రజాదరణే దీనికి కారణం. రాక్ స్టార్ బాబాగానూ పేరొందిన 50 ఏళ్ల గుర్మీత్ పై రేప్ కేసులే కాదు హత్య, దందా వంటి కేసులూ ఉన్నాయి. మరి, ఇంతటి నేరచరిత్ర గలిగిన బాబాకు ఇన్ని కోట్ల మంది మద్దతెలా లభిస్తోంది?

ఇతగాడి నేరాల చిట్టా..

2002లో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేశారని కేసు

2002లో డేరా సచ్చా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ను చంపించాడని కేసు

2007లో మరో మహిళలపై అత్యాచారం చేశాడని కేసు

2010లో తన డ్రైవర్ ఫకీర్ను కిరాయి హంతకులతో మట్టుబెట్టించాడని కేసు

2014లో డేరా సచ్చా సౌదలో 400 మంది యువకులకు వృషణాలు తొలగించినట్లు మరో కేసు

2015లో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని మరో కేసు..

2015లో కమలేశ్ కుమార్ అనే వ్యక్తి భార్యను కిడ్నాప్ చేసినట్లు కేసు

2016లో బాబా విష్ణుమూర్తి గెటప్ లో కనిపించారని ఓ కేసు

ఇవి రికార్డులకెక్కినవి. ఎక్కనివి మరెన్నో..

ఎందుకంటే బాబా సకలకళావల్లభుడు కనక. అతడు అధ్యాత్మిక గురువు, సినిమా నటుడు, గాయకుడు, దర్శకుడు, సంఘ సేవకుడు, క్రీడాకారుడు, నేరచరితుడు.. మరెన్నో.. వీటితోపాటు రేపిస్టు కూడా అని కోర్టు తీర్పుతో తేలిపోయిందిప్పుడు! హత్య కేసుల్లోనూ దోషిగా తేలితే హంతకుడు అనే టైటిల్ కూడా దక్కుతుంది. ఈ డేరా బాబాకు 150 దేశాల్లో భక్తులు ఉన్నారు. దేశవిదేశాలల్లో మొత్తం 46 ఆశ్రమాలు ఉన్నాయి. వీటి ప్రధాన కేంద్రం హరియాణాలోని సిర్సా పట్టణంలో ఉంది.

తాను అన్నిమతాల సారాన్ని ప్రచారం చేస్తానని చెబుతుంటాడు ఇతగాడు. అందుకే  రాం రహీం సింగ్ అని పేరుపెట్టుకున్నాడు. ముఖ్యంగా సిక్కు మతస్తుల నుంచి ఇతని ఆదరణ ఉంది. ఇతడు చేస్తున్న సేవా కార్యక్రమాలే ఈ ఆదరణకు కారణం. అయితే సిక్కుమత పెద్దల్లో చాలామందికి ఇతనంటే గౌరవం లేదు. సిక్కు మతబోధనలకు భిన్నంగా ఆర్భాటంగా జీవిస్తున్నాడని, నేరాలకు పాల్పడుతున్నాడని వారంటారు. కేవలం సంఘ సేవ వల్లే ఇతడు ప్రచారంలోకి వచ్చాడని పరిశీలకులు భావిస్తున్నారు. సంఘసేవ మాటున ఎన్ని అక్రమాలకు, అఘాయిత్యాలకు తెగబడినా తనను ఎవరూ  ఏమీ చేయలేరన్న ధీమాతో అతడున్నారని అంటారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అతన్ని పెద్దపెద్ద పురస్కారాలతో సత్కరిస్తున్నాయి. ద్రోణాచార్య, గియాన్స్ ఇంటర్నేషనల్ అవార్డు మరెన్నో ఈ ఖాతాలో ఉన్నాయి.

బాబా పుట్టుకతో ధనవంతుడు. తండ్రి భూస్వామి. 1990లో సత్నం సింగ్ అనే సాధువు ఇతనికి ’సాధువు’ హోదా కట్టబెట్టాడు. తర్వాత శక్తిమంతమైన డేడా సచ్చా సౌదా సంస్థ కు చీఫ్ అయ్యాడు. బాబా సాధువు అంటే సంసారం, పిల్లా, జెల్లాలేరని పప్పులే కాలేయకండి. ఇతడు శుభ్రంగా పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లల్ని కూడా కన్నాడు.

పదోతరగతి కూడా పూర్తి చేయని గుర్మీత్ ఆధ్యాత్మిక ప్రసంగాలను దంచడంలో మాత్రం దిట్ట. భావోద్వేగ ప్రసంగాలతో అనుచరులను బాగా ఆకట్టుకుంటారు. ఆ మత్తులో వారు దేనికైనా తెగిస్తారు.

బాబాపై రెండు హత్యకేసులున్నాయి. 2002లో అతడు తమపై అత్యాచారం చేశాడని ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో ఒకరు ప్రధానమంత్రి వాజ్ పేయికి కూడా లేఖ రాశారు. తర్వాత బాధితులను బాబా బెదరించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజా తీర్పు నేపథ్యంలో విలేకర్లు ఆ మహిళల ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రాణ భయంతో వారు రహస్య ప్రాంతానికి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. డేరా సచ్చా సౌదా అక్రమాలపై వార్తలు రాసిన రాంచందర్ ఛత్రపతి అనే జర్నలిస్టును బాబా చంపించాడనే ఆరోపణలు ఉన్నాయి.