ఉద్యమ విద్యార్థులను వెంటాడుతున్న కేసులు.. పరిష్కారమేది? - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యమ విద్యార్థులను వెంటాడుతున్న కేసులు.. పరిష్కారమేది?

October 25, 2017

తెలంగాణ  రాష్ట్రం ఆవిర్భవించి  మూడు సంవత్సరాలు పైబడింది.  స్వరాష్ట్ర అభివృద్ధిలో  తెలంగాణ  ప్రజలందరూ భాగమవుతున్నారు. కానీ తెలంగాణ సాధన కోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసుల లాఠీ దెబ్బలు భరిస్తూ, ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా, పోరాడి జైళ్లలో గడిపిన విద్యార్థులకు మాత్రం కేసుల కష్టాలు ఇంకా తీరడంలేదు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇందిరానగర్‌కు చెందిన డ్యాగల సలేందర్  తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా  పాల్గొన్నాడు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఐఎస్ఎఫ్‌లో శిక్షణ తీసుకొని ఉద్యోగం సంపాదించాడు సలేందర్. ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాల తర్వాత  సలేందర్‌పై అధికారులు జరిపిన వెరిఫికేషన్‌లో, తెలంగాణ ఉద్యమ సమయంలో సలేందర్‌పై  పలు కేసులు ఉన్నట్టు  గుర్తించారు. వెంటనే సలేందర్‌ను ఉద్యోగంలోనుంచి తొలగించారు. ఒక్కసారిగా.. చేస్తున్న ఉద్యోగం పోవడంతో  సలేందర్‌కు  కుటుంబ కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో ఉన్న కేసులకు సంబంధించి కోర్టు తీర్పు పత్రాలను అధికారులకు చూపెట్టినా లాభంలేకపోయింది. తనపై ఇప్పుడు ఏ కేసులు లేవని, తను నిర్దోషినని సలేందర్ ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది.

ఇది ఒక్క సలేందర్ సమస్య కాదు..  తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లిన  కొన్ని వేలమంది విద్యార్ధుల సమస్య. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాట జేసి, జైళుకెళ్లిన విద్యార్థులు వేలల్లో  ఉన్నారు. వాళ్లపై కొన్ని వందల కేసులు ఉన్నాయి. అందులో ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్ధులతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా  తెలంగాణ సర్కారు ప్రకటిస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తూ, ఉద్యోగాలకోసం  కష్టాలు పడుతూనే ఉన్నారు. మరి తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ల పరిస్థితి సలేందర్‌లాగే అయితే వాళ్ల బాధను, ఎవరితో చెప్పుకుంటారు? అందుకే ఈసమస్యకు  ప్రత్నాయ్నాయ మార్గం కనుక్కుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో  సలేందర్‌లాగా కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న విద్యార్థులకు, వాళ్ల ఉద్యోగాలపై భరోసా ఇవ్వాల్సిన బాధ్యత  ప్రభుత్వాలపై, కోర్టులపై ఉంది. ఈ సమస్యకు పరిష్కారం తొందరగా వెతికితే, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి, దాని కోసం పాటుపడిన విద్యార్ధుల భవిష్యత్తుకు ఓ దారి ఏర్పడుతుంది.