ఆ నాలుగు జోన్లలోనే కేసులు.. రాష్ట్రంలో మరెక్కడా లేవు - MicTv.in - Telugu News
mictv telugu

ఆ నాలుగు జోన్లలోనే కేసులు.. రాష్ట్రంలో మరెక్కడా లేవు

May 15, 2020

4 Zones

హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, ప్రస్తుతం రాష్ట్రంలో మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలన్నారు. ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలు,  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవలం నాలుగు జోన్లకే పరిమితం అయిందన్నీరు. ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ‘ఈ జోన్లలో 1442 కుటుంబాలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులకు ఎవరికీ పాజిటివ్ లేదు. ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్లు పరిగణించడానికి లేదు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నాం. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ సోకినప్పటికీ కోలుకుంటున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదు’ అని కేసీఆర్ తెలిపారు. 

శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎసీలు అమ్మే షాపులు, ఆటోమోబైల్ షో రూములు, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయని స్పష్టంచేశారు. ‘కేంద్రం విధించిన తాజా లాక్‌డౌన్ గడువు ఈ నెల 17 తో ముగుస్తుంది. ఈ సందర్భంగా కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడు వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగు వ్యూహం ఖరారు చేసి, ప్రభుత్వం అమలు చేస్తుంది. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో, వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే తెలంగాణ వాసులకు పరీక్షలు నిర్వహించాలి. వైరస్ ఉంటే ఆసుపత్రికి తరలించాలి. లేకుంటే హోమ్ క్వారంటైన్‌లో ఉంచాలి. హైదరాబాద్‌లో దిగే ఇతర రాష్ట్రాలకు చెందినవారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు పంపించాలి. 

రైళ్ల ద్వారా తెలంగాణకు చేరుకునే వలస కార్మికులకు పరీక్షలు నిర్వహించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమ సొంత రాష్ట్రాలకు పంపించాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు 

నిర్వహించాలి. నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయాలి. మే నెల చివరి నాటికి రెండు సార్లు, జూన్ నెలలో ఐదు సార్లు పిచికారి చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించాలి’ అని కేసీఆర్ అధికారులకు  ఆదేశించారు. 

చెత్తా చెదారం తొలగించాలి. దోమలు రాకుండా విరివిగా ఫాగింగ్ చేయాలన్నారు. ‘గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కరోనా వ్యాప్తి నివారణకు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. పట్టణాల్లో మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్‌పర్సన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. వారి వారి పరిధిలో గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలను చైతన్య పరచాలి. ప్రభుత్వం యంత్రాంగంతో పని చేయించాలి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు, ఇతర అత్యవసర పనులు చేయడానికి నిధుల కొరత లేకుండా చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నెలవారీగా ఇవ్వాలని నిర్ణయించిన నిధులను విడుదల చేస్తున్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేశాం. జూన్ మాసానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.