Cases registered against Sai Priya and her ‘lover’ in Visakhapatnam
mictv telugu

వైజాగ్ సాయి ప్రియ, ఆమె ప్రియుడికి గట్టి షాక్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

August 29, 2022

 

విశాఖలో పోలీసులను బురిడీ కొట్టించిన సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే… జులై 22న విశాఖ బీచ్‌లో సాయిప్రియ కనిపించకుండా పోయింది. ఈ విషయమై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం నేవీ, తీరగస్తీ దళం ముమ్మరంగా గాలించాయి. కానీ, సాయిప్రియ బీచ్‌ నుంచి ప్రియుడితో పరారై అందరినీ తప్పుదోవ పట్టించింది. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు.

సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్‌గార్డ్‌, పోలీసుల సమయం వృథా అయ్యిందంటున్నారు పోలీసులు. పైగా భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు అనుమతించాలంటూ త్రీటౌన్‌ సీఐ కె.రామారావు కోర్టును కోరారు. కోర్టు అనుమతించడంతో సాయిప్రియ, రవితేజపై నమోదు చేసినట్లు తెలుస్తోంది.

పెళ్లిరోజు కావడంతో జులై 22న సాయంత్రం శ్రీనివాసరావు తన భార్య సాయిప్రియను ఆర్కేబీచ్‌కు తీసుకువెళ్లాడు. రాత్రి 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోదామని అనుకుంటుండగా.. శ్రీనివాసరావుకు ఫోన్‌ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు భార్య కనిపించలేదు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి స్పీడ్‌బోట్లు, నేవీ హెలికాప్టర్‌ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. సాయిప్రియను వెతికేందుకు అధికారులు సుమారు రూ.కోటి ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హెలికాప్టర్‌ సాయంతో గాలింపు చేపట్టడంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చింది. చివరికి ఆమె బెంగళూరులో ప్రియుడితో కలిసి ప్రత్యక్షమైంది.