పెళ్లికి ఒప్పుకోలేదని 5 లక్షలు కాల్చేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికి ఒప్పుకోలేదని 5 లక్షలు కాల్చేశాడు..

April 20, 2018

ప్రేమ బలమైనంది. ప్రేమలో విఫలమైతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. కొందరు ప్రాణాలు తీస్తారు. కొందరు ప్రాణాలు తీసుకుంటారు. అయితే ఈ కుర్రోడు మాత్రం అలాంటి ఘోరాలేవీ చేయకుండా రూ. 5 లక్షల డబ్బును కసితో కాల్చిపడేశాడు. మధ్యప్రదేశ్‌లోని సాహోర్‌లో ఈ ఉదంతం జరిగింది.

జితేంద్ర గోయల్ అనే 22 ఏళ్ల యువకుడు ఫైనాన్స్‌ కంపెనీలో క్యాషియర్‌. కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని శనివారం తను పనిచేసే కంపెనీ నుంచి రూ. 6.74 లక్షలు చోరీ చేశాడు. అయితే ఆ యువతి పెళ్లికి ఒప్పుకోలేదు. తాను మరో అబ్బాయిని పెళ్లాడతానని చెప్పింది. దీంతో జితేంద్ర కోపం తట్టుకోలేక రూ.5 లక్షల నగదును అక్కడిక్కడే కాల్చేశాడు. తగలేసిన నోట్లలో ఎక్కువగా రూ. 500 నోట్లు ఉన్నాయి. ‘నీ కోసమే ఈ దొంగతనం చేశాను.. ఇప్పుడు పెళ్లి వద్దంటున్నావు.. ఈ డబ్బు నాకెందుకు..’ అని అన్నాడు. తర్వాత ఆత్మహత్యకు కూడా యత్నించబోయాడు. పోలీసులు విషయం తెలుసుకుని అడ్డుకున్నారు. అతని ఇంట్లో సోదా చేయగా మిగతా డబ్బు దొరికింది.